ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేనేతకు అందని చేయూత... కష్టాల్లో కార్మికులు

కొవిడ్‌ కారణంగా పనులులేక నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ఒకరోజు పని ఉంటే వారం రోజులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Weavers in distress for making handlooms beautiful
చేనేతకు అందని చేయూత...కష్టాల్లో నేత కార్మికులు

By

Published : Dec 3, 2020, 11:07 AM IST

కొవిడ్‌ కారణంగా పనులులేక నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ఒకరోజు పని ఉంటే వారం రోజులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేనేత ముద్రపథకం ద్వారా రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఆదేశాలు జారీ అయినా చాలామంది కార్మికులకు రుణాలు అందడం లేదు. అవగాహన లేక చాలామంది రుణాలకు దూరంగా ఉంటుంటే మరికొందరు అర్జీలు పెట్టుకున్నా అందని పరిస్థితులు నెలకొన్నాయి.

కృష్ణా జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది నేతపరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తారు. అలాంటి పరిశ్రమ కొన్నేళ్లుగా ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. దీనివల్ల అనేక మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి ఇతర రంగాల వైపు వెళ్లిపోయారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు గూడూరు, పెడన, ఘంటసాల, ముదినేపల్లి, చల్లపల్లి, మొవ్వ మండలాల్లో నేతకార్మికులు ఉంటారు. మొత్తం 34 సంఘాల పరిధిలో వేలాదిమంది కార్మికులు నేతపనిపై ఆధారపడి జీవిస్తారు.

ఉన్న సంఘాల్లో ఎక్కువశాతం పెడన నియోజవర్గంలోని పెడన, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, మల్లవోలు, పోలవరం, ఐదుగుళ్లపల్లి, రాయవరం గ్రామాల్లోనే ఉంటాయి. ఆయా గ్రామాల్లో చాలామంది కార్మికులు నేత పనిలేక ఇతర పనులకు వెళ్తుంటే మరికొందరు వచ్చిన పనినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు 1058మంది ఈ ముద్ర రుణాలకు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు కేవలం 41మందికి మాత్రమే రుణాలు అందించారు. దీంతో మిగిలిన వారంతా అప్పులు ఇచ్చేవారు లేక, పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

ముందుకురాని బ్యాంకర్లు

నేత పనిచేసే కార్మికులు ఎవరైనా ఈరుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు తీసుకున్న రుణాన్ని మగ్గం ఏర్పాటు, సామగ్రి కొనుగోలుకు పెట్టుబడిగా వినియోగించాలి. రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణం పొందడానికి అవకాశం ఉంది. అలా తీసుకున్న రుణంపై కార్మికులకు రూ.10వేలు ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. అర్హత కలిగిన కార్మికులు వేలల్లో ఉన్నా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. దీంతో చాలామంది బయట వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.పెడన, గూడూరు, చిన్నాపురం, చల్లపల్లి, ఘంటసాల తదితర ప్రాంతాల్లో ఉన్న కార్మికులు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రుణాలు ఇచ్చిఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

సమస్య ఉంది

ముద్ర రుణాల పంపిణీలో సమస్య ఉంది. ఏయేప్రాంతాల్లో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో జాబితాను బ్యాంకు అధికారులకు ఇచ్చాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిద్దామని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎక్కడ నిర్వహించేదో ఆయా ప్రాంతాల్లో కార్మికులకు తెలియజేస్తాం. అర్హత కలిగిన వారు ఆధార్‌, రేషన్‌ కార్డు, బ్యాంకుఖాతా పుస్తకం నకళ్లతో దరఖాస్తు చేసుకోవచ్ఛు - రఘునందన్‌, ఏడీ, చేనేతజౌళీశాఖ

ప్రత్యేక శిబిరాలు

ముద్ర రుణాలు కార్మికులకు ఇవ్వడం లేదన్న విషయం మాదృష్టికి వచ్చింది. ఎక్కువశాతం కార్మికులు పెడన, గూడూరు, బందరు ప్రాంతాల్లోనే ఉన్నారు. అందుకే ఆ ప్రాంతాల్లో చేనేతజౌళీశాఖ, బ్యాంకు అధికారులతో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించాం. రుణాల పంపిణీపై ఆయా ప్రాంతాల్లోని బ్యాంకర్లతో కూడా మాట్లాడాం. అర్హత కలిగిన ప్రతి కార్మికునికి రుణాలు అందించేలా కృషి చేస్తాం.- రామ్మోహన్‌రావు, లీడ్‌బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌

ఇదీ చదవండి:

రెండు రాష్ట్రాలకు అనుసంధాన దారి..అభివృద్ధికి వారధి

ABOUT THE AUTHOR

...view details