రాజకీయ స్వార్థం కోసమే ముఖ్యమంత్రి జగన్ దిశ బిల్లు తెచ్చారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. తన వ్యతిరేకులను కేసుల్లో ఇరికించి త్వరగా శిక్షించాలనే దీనిని రూపొందించారని ధ్వజమెత్తారు. బిల్లులో లోపాలున్నాయని గతంలో తాము అసెంబ్లీలో చెప్పినా వినిపించుకోకుండా హడావుడిగా కేంద్రానికి పంపారని దుయ్యబట్టారు. ఈ బిల్లును కేంద్రం తిప్పి పంపటం శుభ పరిణామమన్నారు. బిల్లు తెచ్చామనే పేరు తప్ప రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఎక్కడా ఆగలేదని విమర్శించారు.
ప్రభుత్వానికి దిశ బిల్లు ప్రచారంపై ఉన్న శ్రద్ధ మహిళల భద్రతపై లేదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. దిశ బిల్లులో అనేక లోపాలున్నందుకే కేంద్రం తిప్పి పంపిందని దుయ్యబట్టారు. లోపాలతో బిల్లును చేసి... ఆమోదించకపోతే ఆ తప్పును కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందకుండానే అత్యాచార ఘటనల్లో దిశ కేసులు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటం కోసమే రాజమండ్రిలో హడావుడిగా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉదాసీనత వైఖరి వల్లే రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని అనిత ఆక్షేపించారు.