నేను, నా కుమారుడు బ్రతికే ఉన్నాం.. మేమిద్దరమూ చనిపోయినట్లు వాలంటీర్ తప్పుగా నమోదు చేసి బియ్యం కార్డులో పేర్లు లేకుండా చేసి మమల్ని వేదిస్తున్నారని.. ఎడాదిగా మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల మండలం తాడంకికి చెందిన చదలవాడ ఈశ్వరి తెలిపారు.
చదలవాడ విజయబాస్కర్ బాబు యజమానిగా, బార్య చదలవాడ ఈశ్వరి, కుమారుడు సత్యతాపసేంద్ర కుటుంబ సభ్యులుగా సంవత్సరం క్రితం కొత్త బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ 2020లో వారికి కొత్తకార్డు మంజూరు అయ్యంది. భర్త యజమానిగా కార్డు వచ్చినప్పటికి అందులో బార్య, కుమారుడి పేరు లేకపోవడంతో అధికారుల దగ్గరికి పరుగెత్తారు.
బియ్యం కార్డు అర్జీని కంప్యూటరైజ్డ్ చేసేటపుడు అక్కడి వాలంటీర్ పోరపాటున వీరిద్దరూ చనిపోయినట్లు నమోదు చేశాడని అధికారుల విచారణలో వెల్లడైంది. అప్పటినుంచి ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని.. కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆ ఊరి సర్పంచ్ ధనలక్ష్మీ అన్నారు. బియ్యం కార్డులో పేర్లు లేకపోవడంతో కుమారుడి చదువు ఇతర విషయాల్లో తీవ్రంగా నష్టపోతున్నామని ఈశ్వరి వాపోయారు.