ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డేంజర్ బెల్స్.. జలాశయాలలో గతేడాది కంటే తక్కువ నీటి నిల్వలు.. అధికారుల్లో గుబులు

Water levels : ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసాయి. రాజకీయాలకు అతీతంగా చెప్పే మాటలు ఇవి. అయితే, అదే స్థాయిలో వేసవి ఆరంభానికి ముందే రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇది జలాశయాలను పర్యవేక్షిస్తున్న అధికారుల మాట. గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు 56 టీఎంసీలు తక్కువగా ఉన్నట్టు ఏపీ జల వనరుల శాఖ సమాచార వ్యవస్థ స్పష్టం చేస్తోంది. సాగు, తాగునీటి సరఫరాకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం నీటి నిల్వల తగ్గుదలకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టు
శ్రీశైలం ప్రాజెక్టు

By

Published : Mar 30, 2023, 3:48 PM IST

Updated : Mar 30, 2023, 4:02 PM IST

Water levels : రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల సామర్థ్యం కంటే సగం మాత్రమే నీళ్లు ఉన్నట్టు ఏపీ జలవనరుల సమాచార వ్యవస్థ స్పష్టం చేస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల్లో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి నిల్వలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 40కి పైగా ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 475 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నట్టు వెల్లడవుతోంది. వేసవి ఆరంభానికి ముందే రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు సగానికంటే తక్కువ స్థాయికి చేరుకున్నాయి.

ప్రధాన ప్రాజెక్టుల్లోనూ.. ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన.. శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఏపీలోని ప్రధాన 40 ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ప్రస్తుతానికి 475.97 టీఎంసీలు మాత్రమే అని ఏపీ జల వనరుల శాఖ సమాచార వ్యవస్థ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ కలిపి 983 టీఎంసీల మేర పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఉంది. సాగు, తాగునీటి సరఫరాకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం నీటి నిల్వల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ నిల్వలు 56 టీఎంసీలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లోనూ 143 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ నిల్వలు 69 టీఎంసీల మేర తగ్గుదల నమోదు అయ్యింది.

గతేడాదితో పోలిస్తే... ఇక ఫీజోమీటర్ల ద్వారా లెక్కించిన అందుబాటులో ఉన్న భూగర్భజలాలు 614 టీఎంసీల మేర ఉన్నట్టు తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి కూడా 24 టీఎంసీల మేర తగ్గినట్టు వెల్లడవుతోంది. ప్రస్తుతం సిల్టు సహా వివిధ కారణాల వల్ల ప్రధాన ప్రాజెక్టుల్లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో పోలిస్తే 48 శాతం మాత్రమే నీరు నిల్వ ఉంది. మేజర్ ప్రాజెక్టుల్లో 417 టీఎంసీలు, మధ్యతరహా ప్రాజెక్టుల్లో 56 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. వాస్తవానికి గత ఏడాదిలో మొత్తంగా 532 టీఎంసీల మేర నీటి నిల్వలుంటే ఈసారి 56 టీఎంసీల మేర తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గోదావరి, కృష్ణా, పెన్నా సహా ఇతర బేసిన్​లలో వరద ప్రవాహాలు గరిష్టంగానే ఉన్నా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి నిల్వల విషయంలో నిర్లక్ష్యం.. వెరసి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోవడానికి కారణమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 48 శాతం కంటే తక్కువ ఉండటంతో వేసవి సమయంలో తాగునీటి అవసరాలకు నీటికైనా సరిపడేనా అనే విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇవీ చదవండి :

Last Updated : Mar 30, 2023, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details