కృష్ణా జిల్లా గుడివాడలో మంచినీటి సరఫరా విషయంలో అధికారుల ఉదాసీనత.. స్థానిక ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గుడివాడ మున్సిపాలిటీలోని ధన్యాలపేట, బాబూజీనగర్,ఇంద్ర నగర్,వాంబే కాలనీల ప్రజలకు ప్రతి ఏటా వేసవి సమయంలో వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది అధికారుల్లో అలసత్వం నెలకొంది. కుళాయి నీరు రోజులో అరగంట కూడా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.
తాగేందుకు పాచి నీరే గతి.. గుడివాడలో ప్రజల దుస్థితి - bad water
కృష్ణా జిల్లాలోని ప్రధాన మండలాల్లోని ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 36 వార్డులు, లక్షకు పైగా జనాభా కలిగిన గుడివాడ నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా మారింది. కుళాయి నీరు పచ్చగా మారి, అపరిశుభ్రంగా ఉంటున్నప్పటికీ వాటినే మహాప్రసాదంలా ప్రజలు తీసుకెళ్తున్నారు.

అపరిశుభ్రంగా ఉన్న నీరు తాగడం వల్ల తమకు రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నీటి సమస్య పరిష్కారానికి ఇప్పటికే జల వనరుల శాఖ అధికారులతో ప్రస్తుత చర్చించామని పురపాలక శాఖ కమిషనర్ తెలిపారు. కాలువల ద్వారా నీటి విడుదల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. ముందస్తు చర్యల విషయంలో విఫలమైన మున్సిపల్ అధికారులు వారం రోజులుగా నీటి కష్టాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఇది పెద్ద ఇబ్బంది కాదని కొట్టిపడేస్తున్నారు.
స్థానికులు మాత్రం తమకు ప్రతి ఏడాది నీటి ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.