water problem in ap : ఎండలతోపాటు గ్రామాల్లో తాగునీటి సమస్య మొదలైంది. పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటాయి. నీళ్లున్నచోట విద్యుత్తు కోతలతో తాగునీటి పథకాలు నిరుపయోగమవుతున్నాయి. ప్రత్యేకించి ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో ఇప్పటికే ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి పొంచి ఉంది. అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల ప్రజలు ఇప్పటికే సమస్యను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 262 మండలాల్లోని 2,925 ఆవాస ప్రాంతాల్లో నీటి కొరత తలెత్తే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నీటి పథకాల నిర్వహణకు నిధులేవీ? :గ్రామీణులకు తాగునీటి సరఫరాలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాలే (సీపీడబ్ల్యూఎస్) కీలకం. రాష్ట్రవ్యాప్తంగా 591 పథకాలతో 12,477 ఆవాస ప్రాంతాల్లోని 1.53 కోట్ల జనాభాకు తాగునీటిని అందించేలా వీటిని రూపొందించారు. పథకాలను నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీలకు కొన్నేళ్లుగా సరిగా బిల్లులు చెల్లించడం లేదు. అనంతపురం జిల్లాలో సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల నిర్వహణచూసే ప్రైవేటు సిబ్బంది ఇటీవల సమ్మె చేయడంతో 480 గ్రామాలకు సరఫరా నిలిచింది. పెండింగ్ బిల్లులను చెల్లించడంతో సిబ్బంది మళ్లీ విధులకు హాజరయ్యారు.
*కర్నూలు జిల్లాలో 57 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి సుమారు రూ.20 కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. వీటినుంచి 682 గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు అప్పులు తెచ్చి ప్రస్తుతానికి నడిపిస్తున్నారు.
*ప్రకాశం జిల్లాలో 51 పథకాలనుంచి 1,192 ఆవాస ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు. వీటి నిర్వహణ చూసే సంస్థలకు 2019నుంచి బిల్లులు సరిగా చెల్లించడం లేదు. అవి ప్రస్తుతం రూ.26 కోట్లకుపైగా చేరుకున్నాయి.
*ఉభయగోదావరి జిల్లాల్లోనూ సమగ్ర రక్షిత తాగునీటి పథకాలను నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీలకు రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి.
*రాష్ట్రవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)లో పెండింగ్‌లో ఉన్నాయి. మరో రూ.100 కోట్ల బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.