కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఎండి ఇంతియాజ్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ) ఎం.శ్రీనివాసరావుపై హైకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్(ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. వారిరువుర్ని అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపరచాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఈనెల 28కి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు.
అర్హత ఉన్నా 'వైఎస్సార్ చేయూత' పథకం తమకు వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. వారికి ప్రయోజనాలు కల్పించాలని గతేడాది అక్టోబరు 22న హైకోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది.