ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ప్రోద్బలంతోనే ఎస్సీలపై దాడులు' - dalit tonsuring cases in ap

రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడుల గురించి బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని తెదేపా నేతలు సవాల్ విసిరారు. ప్రజలు వైకాపాకు ఇచ్చిన ఒక్క అవకాశం వారి జీవితాలను ప్రశ్నార్థకం చేసిందని ధ్వజమెత్తారు. ఎస్సీలపై దాడులను జగన్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

tdp leaders
tdp leaders

By

Published : Aug 30, 2020, 10:11 PM IST

Updated : Aug 31, 2020, 6:45 AM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఎస్సీ వర్గాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

దాడి జరగని రోజు లేదు..
జగన్ అండ ఉందనే అహంతోనే నేరగాళ్లు ఎస్సీలపై వరుసగా దాడులు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విశాఖ జిల్లా తెదేపా నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదన్న చంద్రబాబు...తొలిదాడి జరిగినప్పుడే కఠినంగా శిక్షిస్తే ఇలాంటి ఘటనలు వెలుగుచూశావే కాదన్నారు. 2 నెలల్లో 2 జిల్లాల్లో ఇద్దరు ఎస్సీ యువకులకు శిరోముండనాలా అని ప్రశ్నించారు. ఎస్సీలపై దాడులను జగన్ ఎందుకని ఖండించడం లేదని నిలదీశారు. వైకాపా నాయకుల దమనకాండకు జగన్ బాధ్యత వహించాలన్నారు.

చర్యలేవి?
ముఖ్యమంత్రి జగన్ కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే కాబట్టే రాష్ట్రంలో ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. భూములు, ఇళ్ల స్థలాల విషయంలో ఎస్సీలను రెవెన్యూ అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలను జగన్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని మరో పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఎస్సీలపై దమనకాండ జరుపుతున్నారని మండిపడ్డారు. షెడ్యూల్ కులాల వారికి ఏం జరిగినా సంబధం లేనట్లుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. ఎస్సీలపై దాడులకు సంబంధించి అధికార పార్టీ నేతలు... ప్రతిపక్షంపై నిందలేయడమేంటని ప్రశ్నించారు. గత 15 నెలల్లో ఎస్సీలపై 375 దాడులు జరిగాయని చెప్పారు.

చర్చకు సిద్ధమా?
ఎస్సీ వర్గాలపై వరుస దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు, శిరోముండనాలు, అఘాయిత్యాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఎస్సీలపై చేసిన దాడులపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నిరసన దీక్ష చేపట్టారు.

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడవకుండా... ఆ మహానుభావుడిని జగన్ ప్రభుత్వం అవమానిస్తోందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. అంబేడ్కర్ వల్ల పదవులు వచ్చాయి తప్ప... జగన్ వల్ల కాదనే విషయం ఎస్సీ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలని హితవు పలికారు.

Last Updated : Aug 31, 2020, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details