విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడోరోజు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే.ఉమాదేవి, తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ సి.పార్థసారథి, మంత్రులు గుమ్మనూరు జయరాం, బొత్స సత్యనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సమాచార కమిషనర్ శ్రీనివాస్ రావు దంపతులు, కమలాపురం శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈఓ, ధర్మకర్తల మండలి ఛైర్మన్ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాలను అందజేశారు.
అమ్మవారికి బంగారు పూలు విరాళం
గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఎం.ఘనశ్యామాచార్యులు, ఎం.రంగా దేవిలు దుర్గమ్మ అమ్మవారికి రెండున్నలక్షల విలువ చేసే 52.1 గ్రాములు బరువు కలిగిన 108 బంగారు పూలను అందించారు. ఆలయ ఈఓ, ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు దాత కుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి ప్రసాదం అందజేశారు.