రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలపై దుమారం రేగుతోంది. మిగతా పండగలకు అడ్డురాని కరోనా నిబంధనలు.. హిందువుల పండగైనా వినాయక చవితికే ఎందుకు వర్తిస్తుందో చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆదివారం కర్నూలులో భాజపా చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతక దారి తీసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రాష్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కమలం పార్టీ. కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డోవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టింది. అధికారులకు వినతి పత్రాలను సమర్పించింది. చవితి వేడుకలపై ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. ఇదే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు కూడా ప్రశ్నలు సంధించారు. సభలు నిర్వహిస్తే రాని కరోనా.. చవితి వేడుకలు నిర్వహిస్తే వస్తుందా అంటూ సర్కార్‌ను ఎంపీ రఘురామ నిలదీశారు.
కొవిడ్‌పై సీఎం సమీక్ష.. కీలక నిర్ణయం!
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో వినాయక మండపాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాత్రిపూట అమలవుతున్న కర్ఫ్యూను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించారు. చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. నిమజ్జన ఊరేగింపులూ వద్దు’ అని వైద్యాధికారులు చేసిన సిఫారసులపై సమీక్షించిన సీఎం..ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు.
'రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలి. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక విగ్రహాలను ఇళ్లలో పెట్టుకునేందుకే అనుమతులివ్వాలి. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దు' - కొవిడ్ సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వ నిర్ణయంపై భాజపా ఫైర్..
వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే కరోనా నిబంధనలు అమలు చేయటంపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చవితికి పందిళ్లు వేసుకొని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలన్న డిమాండ్ ఆందోళనలకు దిగింది. ఆదివారం కర్నూలులోని రాజ్ విహార్ కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ నేతలు సోము వీర్రాజు, సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది.
'హిందువుల పండుగలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు..?కొవిడ్ నిబంధనలతో వినాయకచవితి జరుపుకొనేందుకు అనుమతించాలి. బయటకొస్తే అరెస్ట్ చేస్తామని ఎలా అంటారు..?ఒక వర్గానికి సంబంధించే మీ ప్రభుత్వం ఉంటుందా? రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారు' - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తున్నారు: ఏపీ సాధు పరిషత్
హిందూ సంప్రదాయాలను, ఆచారాలను ధ్వంసం చేయాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసంద సరస్వతి స్వామి మండిపడ్డారు. హిందుత్వం మీద ఎందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రశ్నించారు. కరోనా అడ్డుపెట్టుకుని వినాయక చవితి పండగను అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కరోనా అడ్డురాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలు తొలగిపోవాలని ప్రతీ విధుల్లో ఘనంగా జరుపుకునే ఈ గణపతి నవరాత్రులకు ఆంక్షలు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో లేని ఆంక్షలు ఏపీలో పెట్టడం ఏమిటని.. ఏ పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహించారు. జెరూసలేంకు సీఎం కుటుంబ సభ్యులతో వెళతారు..హిందూ దేవాలయాలకు కుటుంబ సభ్యులతో ఎందుకు వెళ్లడం లేదని ఆరోపించారు. హిందుత్వాన్ని జగన్ గౌరవించడం లేదన్నారు. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకే..
కరోనా వ్యాప్తి దృష్ట్యా వినాయక చవితికి పందిళ్లు వేయకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనను.. భాజపా నేతలు వక్రీకరిస్తున్నారని వైకాపా ఆరోపించింది. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా పూజలు చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని.. ఎవరి ఇళ్లలో వారు పూజలు చేసుకోవచ్చని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కరోనా కట్టడిలో భాగంగానే ప్రభుత్వం.. వినాయక చవితి ఉత్సవాల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించిందని స్పష్టం చేశారు. చవితి ఉత్సవాలపై.. భాజపా మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం, మతం రంగు పూయడం సరైన పద్ధతి కాదన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భాజపా నేతలకు దమ్ముంటే వెంటనే డిల్లీకి వెళ్లి నిబంధనల్లో మార్పులు చేయించాలన్నారు.
'కర్నూలులో భాజపా రాష్ట్ర నేతలు వినాయకుడి విగ్రహాలు పట్టుకొని మత రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఆంక్షలు అమలు చేస్తున్నాం. కరోనా కట్టడిలో భాగంగానే వినాయక చవితి ఉత్సవాల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించాం. భాజపా నేతలు ఆందోళనలు చేయాల్సింది రాష్ట్రంలో కాదు.. దిల్లీలోని ప్రధాని వద్ద... దమ్ముంటే వెంటనే డిల్లీకి వెళ్లి నిబంధనలలో మార్పులు చేయించాలి. కమలం పార్టీ నేతలు విద్వేషాలు రెచ్చగొడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు' -వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి
అంతర్వేది ఘటనపై ఏం చేశారు..?: మల్లాది విష్ణు
పండుగలపై రాష్ట్రంలో అబద్దాలు ప్రచారం చేస్తూ హిందువులను రెచ్చగొట్టేలా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని అధికార పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం బహిరంగ ప్రదేశాల్లో రద్దీ లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలిచ్చిందని.. దాన్ని సోము వీర్రాజు ముందుగా గమనించాలని హితవు పలికారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడంలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వానికి అన్ని సామాజిక వర్గాలూ సమానమేనన్న మల్లాది.. రంజాన్, బక్రీద్లకూ గతంలో ఇదే తరహాలో ఆంక్షలు విధించామన్నారు. హిందువుల పట్ల భాజపాకు ఎంత ప్రేమ ఉందో అంతర్వేది ఘటనపై విచారణ అంశం తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు. అంతర్వేది రథం దగ్ధంపై ఇప్పటి వరకూ సీబీఐ విచారణ ప్రారంభించకపోవడంపై ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రాణం ప్రభుత్వానికి ఎంతో విలువైనదేనని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా స్వామీజీలు వ్యవహరించవద్దని కోరారు.
ఏ విధంగా వర్తించాయి..?: చంద్రబాబు
వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారని తెదేపా అధినేత ప్రశ్నించారు. ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏవిధంగా వర్తిస్తాయని..? నిలదీశారు. తెలంగాణలో వినాయక పూజలకు అనుమతించగా ఏపీలో మాత్రం ఎందుకు నిరాకరించారన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
చవితి జరుపుకుంటనే వస్తుందా: ఎంపీ రఘురామ
సినిమా థియేటర్లు, మద్యం దుకాణాల వద్ద లేని కరోనా.. గణేశ్ మండపాల వద్దే వస్తోందా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వేలమందితో మంత్రులు సభలు నిర్వహిస్తే రాని వైరస్.. వినాయక చవితి జరుపుకుంటేనే వస్తుందా అని నిలదీస్తున్నారని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. నిబంధనల పేరిట హిందూ పండుగలకు అనుమతివ్వకపోవడం సరికాదన్న రఘురామ.. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకొని కొవిడ్ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఈ పరిస్థితుల్లో చవితి వేడుకలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. వెనక్కి తీసుకుంటుందా..? లేక ఆంక్షలను అమలు చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు భాజపా, హిందూసంస్థలు మాత్రం..అనుమతి ఇవ్వకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.
ఇదీ చదవండి
RRR: 'అక్కడ రాని కరోనా.. గణేశ్ మండపాల వద్దే వస్తోందా'