ఈ చిత్రాన్ని పరిశీలించారా..!ఇది 16వ నెంబరు (చెన్నై-కోల్‌కతా) జాతీయ రహదారి ఆరు వరసల విస్తరణ పనులు. కృష్ణా జిల్లాలో మూడో ప్యాకేజీగా ఏడాది క్రితం పనులు చేపట్టారు. శీఘ్రగతిన నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో చిన్నఅవుట్‌పల్లి నుంచి కలపర్రు వరకు రహదారి విస్తరణ, ఇతర నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. దాదాపు 89 శాతం పనులు పూర్తయ్యాయి. లక్ష్మీఇన్‌ఫ్రా సంస్థ దీని నిర్మాణం చేపట్టింది. ఈ ఏడాది మే నాటికి పూర్తి చేసి జాతీయ రహదారుల సంస్థకు అప్పగించనుంది.
బుధవారం హనుమాన్ జంక్షన్ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని గన్నవరం, హనుమాన్‌జంక్షన్ పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రెండు ప్యాకేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు గుత్త సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రహదారి విస్తరణలో మూడో ప్యాకేజీగా చిన్నఅవుట్‌పల్లి నుంచి గొల్లపూడి వరకు విజయవాడ బైపాస్ నిర్మాణం జరగనుంది. ఈ పనులు ప్రారంభమయ్యాయి. నాలుగో ప్యాకేజీలో గొల్లపూడి నుంచి కాజా వరకు కృష్ణా నదిపై వంతెనతో సహా నిర్మాణం చేయాల్సి ఉంది. ఇవి ప్రారంభం కావాల్సి ఉంది.
త్వరితగతిన రెండో ప్యాకేజీ..!
ఇదే జాతీయ రహదారి విస్తరణలో రెండో ప్యాకేజీగా కలపర్రు నుంచి చిన్నఅవుట్ పల్లి వరకు ఉంది. దీన్ని లక్ష్మీఇన్‌ఫ్రా దక్కించుకుంది. దీని అంచనా వ్యయం రూ.707కోట్లు కాగా రూ.503కోట్లకు చేజిక్కించుకుంది. 2019 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించింది. శీఘ్రగతిన నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికి 89 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 27.4 కి.మీ దూరం ఉంది. రెండు పైవంతెనలు హనుమాన్ జంక్షన్ ప్రారంభం, చివరలో నిర్మాణం చేయాల్సి ఉంది. హనుమాన్ జంక్షన్ వద్ద బైపాస్ నిర్మాణం ఉంది. వాహన అండర్ పాస్‌లు 13, మైనర్ వంతెనలు 5, ట్రక్కుబేలు ఒకటి, ఒక టోల్‌ప్లాజా కలపర్రు వద్ద నిర్మాణం చేయాల్సి ఉంది. మొత్తం ఆరు వరుసల రహదారిలో ఒకవైపు 12.5 మీటర్లు, మరోవైపు 12.5 మీటర్లు నిర్మాణం చేశారు. బీటీ కూడా పూర్తి చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ వద్ద బైపాస్ నిర్మాణంలో ఓ అధికార పార్టీ నేత భూమి విషయంలో కొర్రీ వేయడంతో అక్కడ కొంత జాప్యం జరిగింది. ఉన్నత స్థాయిలో దీన్ని పరిష్కరించారు. ఈ ఏడాదే మే నెలలో ఈ ప్యాకేజీ రహదారి అందుబాటులోకి వస్తుందని లక్ష్మీఇన్‌ఫ్రా ప్రాజెక్టు మేనేజర్ రవికాంత్ ‘ఈనాడు’తో చెప్పారు. దీంతో చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు చెక్ పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.