విజయవాడ బెంజి సర్కిల్ వద్ద గల వేదిక కల్యాణ మండపానికి పటమట పోలీసులు నోటీసు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ముందస్తు అనుమతి లేకుండా... అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం నిర్వహణకు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తమ ఆదేశాలను ఖాతరు చేయనందున ఫంక్షన్ హాలు అనుమతి రద్దు చేసే దిశగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మేరకు పటమట పోలీసు ఇన్స్పెక్టర్ వేదిక ఫంక్షన్ హాలు యజమాని చెన్నుపాటి వజీర్‌కు నోటీసులు ఇచ్చారు.
విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 144, సెక్షన్ 32 సీఆర్‌పీసీ, పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నాయని... సమ్మెలు, ర్యాలీలపై నిషేధం ఉందని నోటీసుల్లో చెప్పారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడడం, నిరసనలు, రాస్తారోకోలు, మానవహారాలు చేయడం లాంటి చర్యలకు అనుమతి లేదన్నారు. సెక్షన్144 అమల్లో ఉన్నా.. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేశారని ఆగ్రహించారు. ఐకాస కార్యక్రమాల నిర్వహణకు ఫంక్షన్ హాలు ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అమరావతి పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు చేసే నిరసనల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.