విజయవాడ నగరం నూతన పోలీస్ కమిషనర్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్న బత్తిన శ్రీనివాసులుకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ప్రస్తుతం అదనపు సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు నగరంపై ఇప్పటికే తగినంత అవగాహన ఉంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న రౌడీయిజం, భూ సెటిల్‌మెంట్లు, ట్రాఫిక్ అవస్థలు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, కిందిస్థాయిలో అవినీతి లాంటి సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైల్వే, రోడ్డు మార్గాలకు విజయవాడ అనుసంధానంగా ఉన్నందున గంజాయి స్మగ్లింగ్ నగరం మీదుగానే సాగుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లు, ప్రైవేటు బస్సుల్లో పంపిస్తున్నారు. టాస్క్ ఫోర్స్‌ను మరింత క్రియాశీలం చేయడం సహా, కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్‌ను మరింత పటిష్టపరచాలనే భావన వ్యక్తమవుతోంది.
నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ పోలీసుల నిఘా వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. క్షేత్రస్థాయిలోని వాస్తవ సమాచారం పైకి చేరడం లేదు. నగరం పరిధిలో దాదాపు 450 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో క్రియాశీలకంగా ఉన్నవారిపై నిఘా ఉంచిన అధికారులు.. రౌడీషీట్ లేకుండా గ్యాంగ్‌లు నడుపుతున్న వారిని విస్మరిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ కార్యకలాపాలను నిరోధించాల్సిన అవసరం ఉంది. కొత్త పేట, కృష్ణలంక, పాయకాపురం, పటమట, పెనమలూరు స్టేషన్ల పరిధిలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయి.
ట్రాఫిక్ సమస్యలు తీవ్రం