విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు పునఃప్రారంభం కాగా ఇప్పటికే వెల్లడించిన రిజర్వేషన్ల ఆధారంగా వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థుల్లో హుషారు మొదలైంది. ప్రధానంగా 64 డివిజన్ల నుంచి కార్పొరేటర్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి అత్యధికంగా 32 మంది మహిళలు కౌన్సిల్లో కాలు మోపనున్నారు. మేయర్ పీఠం ఈసారి మహిళ జనరల్‌కు కేటాయించడంతో మరోసారి మహిళలు మేయర్ స్థానం కైవసం చేసుకోనున్నారు. నగరంలో ఈసారి డివిజన్ల పునర్విభజన కూడా జరగడంతో ప్రస్తుత ఎన్నికల్లో రిజర్వేషన్ల డివిజన్లు కూడా పూర్తిగా మారిపోయాయి.
మహిళలకు పట్టం...
నగరంలో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మహిళా ఓటర్ల నిష్పత్తి ఆధారంగా డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయగా, ఈసారి కూడా ఎస్టీ జనరల్‌కు ఒకే డివిజన్ రిజర్వు అయ్యింది. ఇక ఎస్సీ మహిళలకు మూడు డివిజన్లు, ఎస్సీ జనరల్‌కు మరో మూడు డివిజన్ల చొప్పున మొత్తంగా ఆరు డివిజన్లు రిజర్వు కాగా, బీసీ మహిళలకు 10 డివిజన్లు, బీసీ జనరల్‌కు 11 డివిజన్లు కేటాయించారు. ఇక జనరల్ మహిళలకు 19 డివిజన్లు రిజర్వు కాగా, జనరల్‌కు మాత్రం 17 డివిజన్లు మాత్రమే రిజర్వు అయ్యాయి. మొత్తంగా చూస్తే సామాజిక వర్గాల రిజర్వేషన్ల నిష్పత్తి, అన్‌రిజర్వుడు డివిజన్ల సంఖ్య ఆధారంగా మహిళలకు 32 డివిజన్లు దక్కాయి. నగరంలోని మొత్తం 64 డివిజన్లలో 50 శాతం డివిజన్లు ఈసారి మహిళలకు రిజర్వుకావడంతో కౌన్సిల్లో వారికి పెద్దపీట వేసినట్లు అయ్యింది.
ఇవీ చూడండి..:నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. ఏకగ్రీవాలు