ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు అక్టోబరు 17 నుంచి 25 వరకు జరగనున్నాయి. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు ఇప్పటినుంచే చర్యలు ప్రారంభించారు. అన్ని శాఖల అధికారులతో శనివారం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది దసరా ఉత్సవాలకు భక్తుల నియంత్రణపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మొత్తంగా పది రోజుల ఉత్సవాలకు కలిపి.. లక్ష మందికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనానికి అనుమతించకూడదని పాలకమండలి నిర్ణయించింది. రోజుకు పది వేల మంది భక్తులకే పరిమితం చేస్తోంది. కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని- పెద్దసంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఏటా దసరా ఉత్సవాలకు పది రోజుల్లో కనీసం 15 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రోజు కనీసం 80 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తుంటారు.
మూలానక్షత్రం- ఇతర ముఖ్యమైన రోజుల్లో ఈ సంఖ్య రెండు నుంచి రెండున్నర లక్షల మంది వరకు ఉంటోంది. ఈ సంవత్సరం దసరాలో పది గంటలపాటు అమ్మవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గంటకు వెయ్యి మందికి అవకాశం కల్పిస్తారు. తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు.. మిగిలిన రోజుల్లో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలవరకు.... మూల నక్షత్రం రోజున ఉదయం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పైలా స్వామినాయుడు తెలిపారు. దర్శనానికి భక్తులు ఎవరికి వారు తమ వెంట తాగునీరు తెచ్చుకోవాలని... ఉచిత దర్శనం, వంద రూపాయలు, మూడు వందల రూపాయలు, విఐపీ దర్శనం టైమ్‌స్లాట్ ప్రకారం ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తామన్నారు. ఇవాళ్టీ నుంచి దసరా నవరాత్రుల ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు.
ఇదీ చదవండి:'ఆ బిల్లుకు వైకాపా, తెదేపాలు పోటీపడి మద్దతిస్తున్నాయి'