గుడివాడ-మోటూరు, గుడివాడ-మచిలీపట్నం రైల్వే మార్గాల్లో 69 కి.మీ. మేర డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా విస్తరించి నిర్మించిన విజయవాడ-మచిలీపట్నం రైల్వేట్రాక్‌ను గురువారం రైల్వేభత్రతా విభాగం కమిషనర్ రాంకృపాల్, విజయవాడ డీఆర్‌ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం బోగీలతో కూడిన రైలును నడిపి చూశారు.
రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపురం, మచిలీపట్నం-నర్సాపురం-నిడదవోలు మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులను రూ.3వేల కోట్లతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిడివి మొత్తం 221 కి.మీ. కాగా, ఇప్పటికే 124 కి.మీ. పూర్తయింది. మిగతా 97 కి.మీ. పనులు 2021లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గతంలో ఇది సింగిల్ లైను కావడంతో రాకపోకలకు ఇబ్బందులుండేవి. ప్రయాణికుల రైళ్లను ఎక్కువ సమయం ఔటర్‌లో నిలిపివేసేవారు. ఇక గూడ్స్ బండ్లు కూడా సకాలంలో చేరుకోకపోవడంతో డివిజన్ ఆదాయంపైనా ప్రభావం పడేది.
బ్రాంచి లైనులో డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రెండు దశాబ్దాలుగా ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నో పోరాటాలు చేశారు. ఎట్టకేలకు పనులు పూర్తయి ఈ డబుల్ లైను అందుబాటులోకి రావడంతో మధ్య కోస్తా ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం ఏర్పడుతుంది. ప్రయాణికులు, సరకు రవాణా రైళ్లు సమయానికే గమ్యస్థానం చేరుకోనున్నాయి. ఈ కొత్త మార్గం ద్వారా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా తదితర ప్రాంతాలు వెళ్లేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే తుపాన్లు, వరదల సమయంలో విజయవాడ-విశాఖపట్నం మధ్య మెయిన్ లైనులో ఆటంకాలు ఏర్పడితే కొత్త మార్గం ప్రత్నామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఆర్‌విఎన్‌ఎల్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది. గంటకు 110 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో ట్రాక్‌ను నిర్మించారు. ఈ మార్గంలో 11 ప్రధాన వంతెనలు, 222 చిన్న వంతెనలతో పాటు ఉప్పలూరు, ఇందుపల్లి, గుడివాడ, మోటూరు, పెడన, కైతవరం స్టేషన్లను పునర్నిర్మించారు. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను, మొత్తం 24 లెవల్‌క్రాసింగ్ గేట్లు, వాటి వద్ద సౌరశక్తి పలకాలు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: గన్నవరంలో ఘనంగా ఎస్పీఎఫ్ 29వ ఆవిర్భావ దినోత్సవం