ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని సడలించిన నేపథ్యంలో ఈ నెల 9 నుంచి విజయవాడ కనకదుర్గమ్మ(Kanaka Durga Temple) దర్శన(darshan) వేళల్లో మార్పు చేశారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ ఈ మార్పుల గురించి ప్రకటనలో తెలిపారు. నెల రోజులుగా కరోనా ఉద్ధృతి తగ్గడం, ఆంక్షల సడలింపుతో భక్తుల రాక పెరిగింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుర్గమ్మను దర్శించుకోవచ్చని చెప్పారు. వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగనందున పూర్తి జాగ్రత్తలతో భక్తులకు తగిన సౌకర్యాల కల్పనకు నిర్ణయించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
11 నుంచి ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి వరుస వేడుకలకు ముస్తాబవుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే సంప్రదాయ ఉత్సవాల నిర్వహణకు పాలకమండలి, అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి ఆషాఢ సారె, 22 నుంచి శాకంబరీ ఉత్సవాలు, వచ్చేనెల 9 నుంచి శ్రావణ మాస పూజలు నిర్వహించనున్నారు.
దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణకు భక్తులు పేర్లు నమోదు చేసుకుంటే వారికి సమయం కేటాయిస్తామని ఈవో భ్రమరాంబ తెలిపారు. దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు పాలకమండలి తొలి సారెను శాస్త్రోక్తంగా అమ్మవారికి సమర్పించనున్నారు. ఈ నెల 22 నుంచి 24వరకూ జరగనున్న శాకంబరీ ఉత్సవాలకు కూరగాయలు, పండ్ల సేకరణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆగస్టు 9 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్నందున కుంకుమ పూజల నిర్వహణకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి.Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల