నూజివీడు పౌర సంబంధ శాఖలో విధులు నిర్వహిస్తున్న శౌరి ప్రసాద్‌కు శ్వాస తీసుకోవటంతో ఇబ్బంది తలెత్తింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అత్యవసర వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అతనికి ఆక్సిజన్ సిలిండర్ సాయంతో శ్వాస అందిస్తూ అంబులెన్స్‌లో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రులు చుట్టూ అతని భార్య ప్రదక్షిణ చేసింది. అయినా వారు చికిత్స అందించేందుకు నిరాకరించారు. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన రిపోర్ట్ చూపినా వైద్యం అందించేందుకు విముఖత చూపించారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ బాధితుని భార్య ఓ సెల్ఫీ వీడియోలో పరిస్థితిని వివరించింది. ఇలాంటి పరిస్థితి పగ వారికి కూడా రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటంతో నూజివీడు తహశీల్దారు, ఆర్డివో స్పందించి జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే వైద్యాధికారులతో మాట్లాడారు. అత్యవసర వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం బాధితుడు ప్రసాద్‌కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.