గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం : వెంకయ్య నాయుడు vice president Venkaiah Naidu in Swarnabharat Trust : గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లోని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన..పల్లెల్లో సేవలందించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం చేసే సాయం ఉపాధిని అందించి.. కష్టపడేందుకు ప్రోత్సాహించాలే తప్ప సోమరులుగా మార్చకూడదని హితవు పలికారు. ఉచితం ఎంతవరకు సముచితమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.ఉచితం ఎంతవరకూ సముచితమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేయాలని, ప్రజలకు చక్కని నైపుణ్యాభివృద్ధిని అందించి, వారు నిలదొక్కుకునేందుకు సహకారం అందించాలే తప్ప, ఉచితాలు అలవాటు చేయడం ద్వారా ప్రయోజనం ఉండబోదని తెలిపారు.
సేవే అత్యుత్తమ సాధనం..
ఏ స్థాయిలో ఉన్నా, ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తనకు ఎంతో ఆనందం లభిస్తుందన్న ఉపరాష్ట్రపతి... సంతోషమయ జీవనానికి సేవే అత్యుత్తమ సాధనమని తెలిపారు. ఆధ్యాత్మికతలోని అంతరార్ధం సాటి వారికి సేవ చేయడమేనన్న ఆయన, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య సహాయం చేయడం, వసతులు లేనివారికి విద్యాసహాయం చేయడం, ఆపదలో ఉన్నవారికి ధనసహాయం చేయడమనేది సమాజసేవ రూపంలో చేసే ఆధ్యాత్మికసేవ అన్నారు. సేవాలయాలే నిజమైన దేవాలయాలన్న ఆయన, సేవ ద్వారా లభించే సంతృప్తికి అవధులు లేవని తెలిపారు. అదృష్టం అంటే కష్టానికి కాలం కలిసి రావడమేనన్న ఉపరాష్ట్రపతి, కష్టపడడం ద్వారా ఆత్మవిశ్వాసంతో అదృష్టాన్ని సైతం స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు. కష్టపడి పని చేసే తత్వం, క్రమశిక్షణ, విషయ పరిజ్ఞానం, ఎదిగిన కొలదీ ఒదిగి ఉండే తత్వం విజయానికి ప్రధానమన్న ఆయన, సకారత్మక ఆలోచనలతో కష్టపడడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాతృభాష ప్రాధాన్యతను తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ఓ ఉన్నతమైన భాషకు వారసుణ్ని అని చెప్పుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని, మన భాషను, తద్వారా సంస్కృతిని పరిరక్షించుకుని ముందు తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.
యువత చైతన్యవంతమైన జీవనశైలి ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, ఆధ్యాత్మిక భావాలతో మానసిక సంతులనాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ళ రవి, ఉపాధ్యక్షులు మోదుకూరి నారాయణ రావు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి నాగభూషణం, రామినేని పౌండేషన్ నిర్వాహకులు రామినేని ధర్మప్రచారక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి