కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో ఈరోజు సాయంత్రం స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణ(Raithu Nestham Awards ceremony at Swarna Bharathi trust)లో ఏర్పాటు చేసిన ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు(Venkaiah Naidu at Raitu Nestam Awards ceremony). ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం మాసపత్రిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో.. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా.. జల సంరక్షణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరముందని అన్నారు. వర్షపునీటి నిల్వకు ప్రతి రైతూ పొలంలోనే గుంతలు తవ్వాలని సూచించారు. నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు.
‘‘మన దేశానికి అనాదిగా వ్యవసాయమే వెన్నెముక. సాగు ఖర్చులను రైతులు బాగా తగ్గించుకోవాలి. వ్యవసాయం అనేది ఎప్పుడూ పర్యావరణ హితంగా ఉండాలి. రసాయనాలు వచ్చాక భూమి, మనిషి ఆరోగ్యం చెడిపోయాయి. రైతులు క్రమంగా ప్రకృతి సేద్యంపై దృష్టి పెడుతున్నారు. రసాయనాలు వాడని పంటలకు మంచి ధర వస్తోంది. ప్రకృతి సాగు ద్వారా భూసారం పెంచుకుంటున్నారు. పొలం గట్లపై లాభాలిచ్చే వివిధ రకాల చెట్లు పెంచాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు.