వర్మను అడ్డుకున్న పోలీసులు కృష్ణా జిల్లా గన్నవరంలో సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ..ఎన్నికల కారణంగా రాష్ట్రంలో విడుదల కాలేదు. ఇప్పుడు ఎన్నికలు పూరైనందున మే 1న సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తమైంది. సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని వర్మ ప్రకటించారు. అయితే మీడియా సమావేశానికి ఆ హోటల్ సిబ్బంది అనుమతి నిరాకరించారు. దీనితో బహిరంగంగానే మాట్లాడడానికి వర్మ సిద్ధమయ్యారు. సాయంత్రం రోడ్డుపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటం వల్ల ప్రెస్‌మీట్ వద్దంటూ పోలీసులు...రామ్‌గోపాల్ వర్మను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున బహిరంగ సమావేశాలకు అనుమతి లేదంటూ నిలువరించారు. హోటళ్లు, క్లబ్బుల యాజమాన్యాలు ఓ వ్యక్తికి భయపడి విలేకరుల సమావేశానికి అనుమతి ఇవ్వడం లేదంటూ వర్మ ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.