కేసుల దర్యాప్తులో అసలు నిందితులను త్వరితగతిన అరెస్టు చేయమని చంద్రబాబు.. పోలీసులను లేఖలో కోరడం తప్పా అని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు రాసిన లేఖకు పోలీసులు స్పందించిన తీరు గర్హనీయమంటూ.. వర్ల రామయ్య డీజీపీకి మరో లేఖ రాశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు భావస్వేచ్చ హక్కు హరించేలా ఉందని విమర్శించారు.
రాజమహేంద్రవరంలో ఓ బాలికపై బలవంతం చేయడానికి ప్రయత్నించిన నిందితుల అరెస్టులో జాప్యమెందుకని ప్రశ్నించడం చంద్రబాబు చేసిన తప్పా అని నిలదీశారు. బాధితుల ఇంటిపై దాడి చేసి ఫిర్యాదు వాపసు తీసుకోమని బెదిరించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని బయటకురానీయకుండా కాపలా కాసింది నిజమా కాదా చెప్పాలన్నారు. బాలిక తండ్రి ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం పోలీసులు చెప్పాలని కోరారు.