దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద జరుగుతున్న రైతు ఉద్యమానికి మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వర రావు నేతృత్వంలోని రైతు సంఘం నేతలు సంఘీభావం తెలిపారు. 10 మంది రైతు నేతల బృందం రూ.10 లక్షల విరాళాన్ని రైతుల ఉద్యమాన్ని నడిపిస్తున్న కిసాన్ సంఘర్షణ సమితికి అందజేశారు. అమరావతి రైతుల నుంచి సేకరించిన ఆకుపచ్చ టవల్స్ ను సింఘు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు అందజేశారు.
ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులును తీసుకొచ్చిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయాన్ని ఆసరా చేసుకుని.. కొత్త చట్టాలు తీసుకువచ్చి.. కార్పోరేట్లకు లబ్ధి జరిగేలా వ్యవహరించారని ఆరోపించారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.