మచిలీపట్నంలోని 50 డివిజన్ పరిధిలో 2 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పట్టణంలోని అనేక చోట్ల ఖాళీ స్థలాలూ అధికంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో స్థలాలు కొని ఖాళీగా వదిలేశారు. వలందపాలెం, మాచవరం, పరాసుపేట, భాస్కరపురం, బ్రహ్మపురం, ఈడేపల్లి, ఆర్టీసీ కాలనీ, గొడుగుపేట, రాజుపేటల్లోని ఖాళీ స్థలాల్లో మురుగునీరు చేరి తటాకాలు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల పిచ్చిమొక్కలు మొలిచి చిట్టడవుల్లా తయారయ్యాయి. పలు చోట్ల జనావాసాల మధ్యలోనే ఇవి ఉండటంతో.. దోమలు, పందులతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. సమస్య తీవ్రతపై గట్టిగా ప్రశ్నిస్తే స్థల యజమానులకు నోటీసులు జారీ చేయడం.. తరువాత వదిలేయడం అధికారులకు పరిపాటిగా మారింది.
అన్ని చోట్లా అంతే...
ఒక్క మచిలీపట్నంలోనే కాక పెడన, తిరువూరు, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, నందిగామ ఇలా అన్ని పురపాలక సంఘాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం వస్తే చాలు ఈ ఖాళీస్థలాల్లో నీరుచేరి తటాకాలుగా మారిపోతున్నాయి. వర్షాకాలంలో వీటి వల్ల సమస్య తీవ్రంగా ఉంటుంది. కొన్ని సార్లు మోటారు ఇంజన్‌లు ఏర్పాటు చేసి.. నీటిని బయటకు తోడించాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
- పెడనలోని కొత్తపేట, బ్రహ్మపురం, వీరభద్రపురం ఇలా అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి.
- తిరువూరులో.. కట్టిన ఇళ్ల కంటే ఖాళీస్థలాలే ఎక్కువ ఉంటాయంటే అక్కడ తీరు మరీ దారుణం అని తెలుస్తోంది. తిరువూరు రాజుపేట, నందింతిరువూరు, శాంతినగర్, అశోక్నగర్లోనూ ఇవే ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారు.
- జగ్గయ్యపేట మున్సిపాలిటీలోని కాకానీనగర్, డాంగీ నగర్, శాంతీనగర్ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఖాళీ స్థలాలు ఉన్నాయి.
- నూజివీడులోని బంగినపల్లితోట, ఎం.ఆర్ అప్పారావు కాలనీతోపాటు పలు వార్డుల్లో.. దశాబ్దాలుగా ఎంతోమంది తమ స్థలాలను ఖాళీగా వదిలేశారు. ఎంప్లాయీస్ కాలనీలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
- గుడివాడ పట్టణం పరిధిలోని రాజేంద్ర నగర్, ఆర్టీసీ కాలనీల్లో సుమారు 30 నుంచి 35 వరకు ఖాళీ స్థలాలు కొన్నేళ్లుగా పిచ్చిచెట్లు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆదాయం పోతున్నా పట్టించుకోరే?