ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కైకాల సత్యనారాయణ అకాల మృతి.. కౌతవరంలో విషాద ఛాయలు

Kaikala Satyanarayana Untimely death: నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సొంత నిధులతో కౌతవరం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కైకాల అకాల మరణాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Untimely death of Kaikala
కైకాల సత్యనారాయణ అకాల మృతి

By

Published : Dec 23, 2022, 1:50 PM IST

కైకాల సత్యనారాయణ అకాల మృతి

Kaikala Satyanarayana Untimely death: నవరస నటసార్వభౌముడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామ అభివృద్ధికి తన పరిచయాలతో ప్రభుత్వ నిధులను తీసుకురావడమే కాక, లక్షలాది రూపాయల సొంత నిధులతో కౌతవరం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కైకాల అకాల మరణాన్ని.. గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. కైకాల ఆరోగ్యం కుదుటపడి అంత బాగుందనుకున్న సమయంలో ఇలా జరగటం తమను కలచివేసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

కైకాల మరణ సమాచారం అందుకున్న బంధువులు హుటాహుటిన హైదరాబాద్ తరలి వెళ్లారు. జన్మనిచ్చిన కౌతవరమన్న, నాటక రంగ కళాకారుడిగా జన్మనిచ్చిన గుడివాడన్న కైకాల సత్యనారాయణకు ఎంతో అభిమానం. కళాకారుడిగా తీరిక లేని నాటి రోజుల్లో తరచూ కౌతవరం వచ్చి, తన మిత్రులను కలుసుకునేవారని నాటి రోజులను గ్రామస్థులు నెమరు వేసుకున్నారు. కైకాల బాల్యం ఎక్కువగా ఊరి చెరువు చుట్టూనే పెనవేసుకొని ఉండడంతో, ఆ చెరువు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ ఉండేదని, కౌతవరం నుంచి ఎవరు వచ్చిన సరే చెరువు బాగోగులు అడిగి తెలుసుకునే వారని గ్రామస్థులు తెలిపారు.

అనంతరం గ్రామ చెరువులో పెరిగిన చేపలను ఎంతో ఇష్టంగా తినేవారిని, ముఖ్యంగా చేప తల అంటే మరీ ఇష్టంగా తినేవారని కైకాల స్నేహితులు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గ్రామంలో ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో స్నేహితులందరం కలిసి గ్రామస్థుల సహకారంతో కైకాల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్నేహితులు, బంధువులు తెలియజేశారు.

కైకాల సత్యనారాయణ పదవ తరగతి వరకు కౌతవరంలోనే చదివారు. ఆ తరువాత గుడ్లవల్లేరులో ఇంటర్, ANR కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్నప్పటీ నుంచే ఆయన నాటకాలు వేశారు. వాళ్ల తాత సినీ ఫిల్డ్‌కి వద్దన్నా ఒంటరిగానే మద్రాసుకు వెళ్లిపోయారు. అక్కడ నానా కష్టాలు పడి చివరికి నిలబడ్డారు. కౌతవరంకి సొంత డబ్బులతో చాలా పనులు చేయించారు.- పాపీశెట్టి రాంబాబు, కైకాల మేనల్లుడు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details