Unpaid salaries of teachers in AP : పాఠశాలల్లో కోడిగుడ్లు నిల్వ సరిగా లేకపోయినా వారిదే బాధ్యత. మరుగుదొడ్ల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేయకపోయినా, రాగిపిండి నిల్వ నమోదు చేయకపోయినా తప్పే.. ‘నాడు-నేడు’ పనుల్లో పురోగతి లేకపోయినా షోకాజ్ నోటీసులిస్తూ ఉపాధ్యాయులను వైసీపీ సర్కారు భయభ్రాంతులకు గురిచేస్తోంది. చదువు చెప్పించడం తప్ప అన్ని పనులూ ఉపాధ్యాయులతో చేయిస్తున్నారని గతంలో హైకోర్టు వ్యాఖ్యానించిందంటే.. తాజా పరిస్థితి ఎలా ఉందో తెలియనిది కాదు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులను వరసలో నెలబెట్టే బాధ్యత కూడా టీచర్లకే అప్పగించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.
Teachers meeting with Botsa: మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల భేటీ.. మేలు జరగకపోతే ఉద్యమం చేపడతాం
జీతాలే లేవు.. సకాలంలో జీతాలు అందకపోవడంతో బ్యాంకు వాయిదాలు, ఎల్‌ఐసీలు, కుటుంబ ఖర్చులు, మందులకు ఉపాధ్యాయులు చేయిచాచాల్సిన దుస్థితి నెలకొంది. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడమంటే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీలు, పదోన్నతులు పొందిన,సర్దుబాటులో భాగంగా మరో పాఠశాలకు వెళ్లిన దాదాపు 30వేల మందికి మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం సెప్టెంబర్ 5న ప్రభుత్వం జీతాలిస్తుందని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది. హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ బోధిస్తున్న 1,700 మంది అధ్యాపకుల వేతనాలు ఇప్పటికీ ఖజానాకే చేరలేదు. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి అప్‌గ్రేడ్ అయిన పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ( Teachers' Salary Bills ) ఇంకా సమర్పించనేలేదు. ఆర్థికశాఖ అనుమతి లేకుండానే ఎంఈఓ-2లను నియమించగా.. వారికి వేతనం ఎప్పుడు అందుతుందో తెలియని దుస్థితి. ప్రధానోపాధ్యాయుడు డీడీఓగా ఉండి.. ఆయా బడులకు కొత్తగా వచ్చిన, వెళ్లిన టీచర్ల వివరాలున్న చోటే బిల్లులను సమర్పించారు.
బకాయిలు అడగకూడదని.. జీతాలు ఆలస్యం చేస్తున్నారా..? : బొప్పరాజు
మరుగుదొడ్ల ఫొటోలు తీయలేదని..గౌరవమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తున్న ప్రభుత్వం.. ఫొటోలు ఆన్‌లైన్ పెట్టలేదని షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో 68 మంది ప్రధానోపాధ్యాయులకు డీఈఓ షోకాజ్ నోటీసులు ( Show Cause Notices ) జారీ చేయడం గమనార్హం. వారిపై క్రమశిక్షణ చర్యలు ఎదుకు తీసుకోకూడదో చెప్పాలంటూ పేర్కొన్నారు. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులను ఉపాధ్యాయులతోనే చేయిస్తూ.. పురోగతి సరిగా లేకుంటే ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేస్తోంది. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వైసీపీ నాయకులే అనధికారికంగా కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. పనులు ఇచ్చేందుకు ఉపాధ్యాయులు అంగీకరించకపోతే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మరో వైపు పనుల్లో జాప్యం జరిగినా.. నాణ్యత లేకపోయినా ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులు పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాల్సి వచ్చింది.