కరోనాకి నిజమైన డాక్టర్లు ప్రజలేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ వైరస్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమన్నారు. దేశాల మధ్య యుద్ధం జరిగితే సైనికులు మాత్రమే పోరాడుతారని, కరోనాను పారద్రోలడానికి 130 కోట్ల ప్రజలు యుద్ధం చేస్తున్నారని కొనియాడారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశం మెరుగ్గా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకూ దేశంలో విమానాశ్రయాల ద్వారా 16 లక్షలు, ల్యాండ్ బోర్డర్ ద్వారా 20 లక్షల మంది వచ్చారని వారిలో 778 మందికి కరోనా సోకిందని తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య స్థానిక సంస్థల మధ్య సమన్వయం, నిత్యావసరాలు, మందుల సరఫరా, రవాణాను కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తోందని వివరించారు.