Union Minister Kishan Reddy : రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, నెల్లూరు సహా పలు ప్రధాన రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజమండ్రి, గూడూరు సహా ముఖ్యమైన రైలు స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను.. సమీపంలో ఉండే నగారానికి పొడిగించనున్నట్లు ఆయన తెలిపారు. ధర్మవరం - విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును మచిలీపట్నం వరకు రైల్వే శాఖ పొడిగించగా... విజయవాడ రైల్వేస్టేషన్ లో ఆ రైలును జెండా ఊపి ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సహా రైల్వే అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైల్వేల అభివృద్ధికి కేంద్రం చర్యలు... రైల్వేలను మారుమూల ప్రాంతాలకూ తీసుకుపోవాలని కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న కిషన్ రెడ్డి... ఆధునిక టెక్నాలజీతో వేగవంతమైన రైళ్లు ప్రవేశపెట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో కొత్త రైల్వే లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులు ఉభయ రాష్ట్రాల్లో వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైల్వే అభివృద్ధి చేసేలా కేంద్రం పనిచేస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రైళ్ల అభివృద్ధికి బడ్జెట్ లో రూ.8600వేల కోట్లు నిధులు కేటాయించారన్నారు. యూపీఏ కంటే పదిశాతం అదనంగా నిధులను కేంద్రం కేటాయించిందన్నారు. యూపీఏ హయాంలో ఏపీలో 58కి.మీ. లైన్లు మాత్రమే వేయగా మోదీ ప్రభుత్వంలో కొత్తగా 350కి.మీ. కొత్త లైన్లు వేశామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం... మోదీ హయాంలో 800కిలోమీటర్ల డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు జరిగాయని పేర్కొన్నారు. పలు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్రం బడ్జెట్ లో నిధులు కేటాయించారన్నారు. ఏపీ నుంచి కాచిగూడ, సికింద్రాబాద్ కు వచ్చే వారు నగరంలో దిగి పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ కు రైళ్లలో వచ్చే ఆంధ్రుల సౌకర్యం కోసం నగర శివారు చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టర్మినల్ కడతామన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే డిసెంబర్ లోపు వంద వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.