కరోనా పై పోరుకు యునిసెఫ్, రెడ్ క్రాస్ సంయుక్తంగా పనిచేయడం శుభపరిణామమని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. వీరు కరోనా మహమ్మారి చూపుతున్న ప్రభావాన్ని సమర్ధవంతగా ఎదుర్కోవటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో కార్యక్రమాల నిర్వహణకు కాలపరిమితితో కూడిన ప్రణాళిక రూపకల్పన అవసరమన్నారు.
విశ్వవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అనుమతిని మంజూరు చేయాలని యూనిసెఫ్ రాసిన లేఖకు గవర్నర్ వెంటనే స్పందించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునిసెఫ్ క్షేత్ర కార్యాలయ ముఖ్య ప్రతినిధి- మీటల్ రుస్డియా.... రెడ్ క్రాస్ తో సంయుక్త భాగస్వామ్యాన్ని అకాంక్షిస్తూ తమ సంసిద్ధతను తెలిపారు.
యునిసెఫ్ ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్‌క్రాస్ వాలంటీర్ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపట్టి... వారిలో సామర్ధ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుందన్నారు. పిల్లల రక్షణ, నీటి వినియోగం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యకలాపాలకు సంబంధించి పాఠశాలల స్దాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ద్వారా చిన్నారులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాక.. పిల్లల అభివృద్ధి, ఆరోగ్య అవగాహన వంటి వాటిపై లోతైన అవగాహన కల్పిస్తుంది. శ్వాసకోశ పరమైన అంశాలపై పూర్తి స్దాయి అవగాహనకు మార్గం కల్పిస్తూ భౌతిక దూరం సాధన పై ప్రత్యేక దృష్టి నిలుపుతుంది.