UAE Ambassador to India : భారత్‌లో యూఏఈ రాయబారి అబ్దుల్ అన్సారీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ముఖ్యమంత్రి వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫుడ్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీలో పెట్టుబడులకు సిద్ధమని యూఏఈ రాయబారి వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమన్నారు. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు...ఏపీ కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు వివరించారు. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణా చేయకుండా నియంత్రించేందుకు మొత్తం 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకతో సరిహద్దు కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఎన్నికల అధికారులతో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూ విభాగాల అధికారులు, సిబ్బందితో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు సీఎస్ తెలిపారు. చెక్ పోస్టుల ద్వారా ఇప్పటి వరకూ 3,008 లీటర్ల అక్రమ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్, ఒక్కొక్కటి 90 మిల్లీ లీటర్లు కలిగిన 444 టెట్రా ప్యాక్‌లు, రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.