అదే స్థాయిలో రెండు ఘటనలు
2020, అక్టోబరు 12న.. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన చిన్నారి అనే యువతిపై అదే గ్రామస్థుడు నాగభూషణం అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగభూషణం మరుసటి రోజు మృతి చెందాడు.
2020, అక్టోబరు 15.. నాగేంద్రబాబు అనే యువకుడు క్రీస్తురాజపురంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజశ్విని ఇంటికి వెళ్లి, విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఆమె ప్రాణాలను బలిగొన్నాడు. తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనకూ ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల విచారణలో తేలింది.
మహిళలపై దాడులెన్నో...
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అత్యాచారం, హత్యలు, లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు, ఆత్మహత్యకు ప్రేరేపించటం వంటి వాటిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 2013 నుంచి 2019 వరకు మహిళలపై జరిగిన వివిధ రకాల దాడుల కేసులు ఇలా ఉన్నాయి...
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు ఘోరమైన ఘటనల్లో యువతులు మృతిచెందడం కలకలం రేపుతోంది. మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. చట్టాలను కఠినంగా అమలు చేస్తే.. ఇలాంటివి పునరావృతం కావని మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
నాటి సంచలనాలు..
- 2004, జూన్ 21న... శారదా పీజీ కళాశాలలో ఎంసీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న శ్రీలక్ష్మి తరగతి గదిలోనే దారుణహత్య. తోటి విద్యార్థి మనోహర్ ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, ప్రాణం తీశాడు.
- 2007, ఫిబ్రవరి 10న... గుడివాడకు చెందిన ఓ టీవీ యాంకర్ గవర్నర్‌పేటలోని ఓ లాడ్జిలో హత్యకు గురయ్యారు. మేకప్‌మెన్‌గా పని చేసే చంద్రశేఖర్ ఆమెను లాడ్జికి తీసుకువచ్చి, దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం.
- ఇదే తరహాలో ప్రేమ విషయమై అప్పట్లోనే పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక హత్యకు గురయ్యింది. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిపై హత్యాయత్నం జరిగింది. ఈ నాలుగు ఘటనలతో విజయవాడ పెను సంచలనాలకు కేంద్రమైంది.