విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ విద్యార్హత ధ్రువ పత్రాలతో ఉద్యోగోన్నతి పొందిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ.. ఈవో భ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. వారిపై చీటింగ్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. దుర్గగుడిలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డీవీఎస్ రాజు 2013-2015 సంవత్సరాల మధ్య బిహార్‌లోని బోధ్‌గయా మగధ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందినట్లుగా ధ్రువపత్రాలను సృష్టించి పదోన్నతి కోసం దాఖలు చేశారు. వేరే విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్.. ఇంటర్, డిగ్రీ ధ్రువీకరణ పత్రాలను రాజస్థాన్‌లోని యూనివర్సిటీ నుంచి పొంది, సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి సాధించారు.
2018లో కొందరు ఉద్యోగులపై విజిలెన్సు ఎంక్వైరీ జరిగింది. ఆలయంలోని 10 మంది ఉద్యోగులకు సంబంధించిన విద్యార్హతల పత్రాలను నిగ్గుతేల్చాలని దేవాదాయ శాఖకు విజిలెన్సు విభాగం అప్పట్లో నివేదిక ఇచ్చింది. ఈక్రమంలో లక్ష్మణ్, రాజు అనే ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు రావడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు ఈవో సంబంధిత యూనివర్సిటీలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు సిబ్బంది తాము ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు అంగీకరించారు. దీంతో వీరిని సస్పెండ్ చేసినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. మరికొంత మందిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు.