పోలీసు అధికారులమంటూ అమాయక ప్రజలను బెదిరించి నగదు వసూలు చేస్తున్న వ్యక్తులను మచిలీపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. అనిశా డీఎస్పీ, పోలీస్ అధికారులుగా అవతారం ఎత్తిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్ మంగలి శ్రీను అనే నిందితుడిని.. అనంతపురం జిల్లా నల్లమడ మండలం మంగళ వెలమద్ది గ్రామస్థుడిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనుకి 20 ఏళ్ల నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి: మోదీ
సిబ్బందితో కలిసి పెడన ఎస్సై మురళి తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులను చూసి నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. బందరు తాలూకా సీఐతో కలిసి పెడన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గతంలో గొలుసులు, ద్విచక్రవాహనాలు, ఇతరత్రా దొంగతనాలు చేయగా.. కదిరి, పూతలపట్టు, పీలేరు, మదనపల్లి, పాకాల, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో 17 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచే సమయంలో ఎస్కౌర్ట్ సిబ్బందిని ప్రలోభపెట్టి తప్పించుకునేవాడని పేర్కొన్నారు. 2009 నుంచి 2013 సంవత్సరం వరకు కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించినట్లు చెప్పారు. అనంతరం పోలీసు శాఖకు చెందిన వ్యక్తిగా నమ్మించి ఫోన్ ద్వారా అమాయక ప్రజలను బెదిరించడం, భయపెట్టడం, కేసులు మాఫీ చేయిస్తానంటూ లక్షలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడని ఏఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు.. చామంతి, సంపెంగలతో పూజలు