MLC Kavitha Letter To CBI : మద్యం కుంభకోణం కేసు విచారణ వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. సీబీఐ నోటీసులు పంపటం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాఖీదులందుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కవిత.. కాసేపటికే దిల్లీలోని సీబీఐ డీఎస్పీ అలోక్‌కుమార్ షాహికి లేఖ రాశారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం రాత్రి సీఆర్పీసీ-160 కింద కవితకు నోటీసులు ఇచ్చింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లో గానీ.. దిల్లీలో గానీ ఆమె నివాసంలో విచారించాలనుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా పలు అంశాలపై విచారించాల్సిన అవసరం ఏర్పడిందని.. ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో తెలియజేయాలని సూచించింది. నోటీసులు అందుకున్న కవిత హైదరాబాద్‌లోని నివాసంలో వివరణ తీసుకోవచ్చని అధికారులకు వెల్లడించారు.
ఆ డాక్యుమెంట్లను పంపిన తర్వాతే వివరణ:ఈ నేపథ్యంలోనే మద్యం కేసుకు సంబంధించిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కోరుతూ సీబీఐ డీఎస్పీకి ఆమె లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన.. ఎఫ్ఐఆర్ నకలును సాధ్యమైనంత త్వరగా తనకు అందించాలని కోరారు. తద్వారా తనకు వివరణ ఇవ్వడం తేలిక అవుతుందని తెలిపారు. ఆ డాక్యుమెంట్లను పంపిన తర్వాతే వివరణ ఇచ్చే తేదీని ఖరారు చేసి.. హైదరాబాద్‌లో కలుద్దామని వివరించారు.