గుంటూరు జిల్లాలో...
పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నివాళులర్పించారు. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. వాసవి యూత్ ఆధ్వర్యంలో తెనాలిలో వీర సైనికులకు నివాళులు అర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాలో...
పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు విశ్వహిందూ పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. మైలవరంలో అమర జవాన్లను స్మరిస్తూ పోలీసులు, సాయి సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, మిలటరీలో సేవలందించిన వారిని సన్మానించారు. అమరులైన వీర జవాన్లకు గుర్తుగా తపాల శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంపును జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాల వేసి గౌరవ వందనం చేశారు. సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో భాజపా ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పాల్గొని, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లాలో...
పుల్వామా దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు విశాఖ జిల్లా ఆనందపురంలో విద్యార్థులు నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.