కృష్ణా జిల్లాలోని విజయవాడ పరిధిలో హైదరాబాద్ జాతీయ రహదారిని (ఎన్‌హెచ్65) ఆరు వరసలుగా విస్తరించాలనేది ఎప్పటినుంచో ఉన్న ప్రతిపాదన. నగరంతో పాటు పరిసర గ్రామ పంచాయతీలు పట్టణీకరణ జరిగిన తర్వాత ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం ఉన్న నాలుగు వరసల రహదారి ఇబ్రహీంపట్నం నుంచి నగరంలోకి వచ్చే వారికి పెద్ద సమస్యగా మారింది. ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి వరకు ద్విచక్ర వాహనదారులు గుండెలను అరచేతిలో పట్టుకుని రావాల్సి వస్తోంది. కేవలం పది కిలోమీటర్ల దూరం ప్రయాణానికి గంట వరకు పడుతోంది. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రహదారిని ఆరు వరసలుగా నిర్మించాలనే డిమాండ్ పెరుగుతోంది.జాతీయ రహదారుల సంస్థ దీనికి ప్రతిపాదనలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరువరసలు నిర్మాణం కాని పక్షంలో కనీసం సర్వీసు రహదారులు నిర్మించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదిస్తోంది.
ఇబ్రహీంపట్నం నుంచి పండిట్ నెహ్రూ బస్టేషన్ వరకు 20 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ప్రస్తుతం కుమ్మరిపాలెం నుంచి ఇబ్రహీంపట్నం వరకు నాలుగు వరసల రహదారి మాత్రమే ఉంది. ఇది ట్రాఫిక్ రద్దీకి సరిపోవడం లేదు.
* చెన్నై నుంచి వచ్చే వాహనాలు వారధి మీదుగా కనకదుర్గ పైవంతెన నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళుతున్నాయి. రాత్రి వేళల్లో భారీ వాహనాలు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం కనకదుర్గ పైవంతెన వరకు రహదారి బాగుంది. అక్కడి నుంచి అడుగడుగునా ట్రాఫిక్ ఆగిపోతోంది.
* విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు ఇన్నర్‌రింగు రోడ్డు మీదుగా చనుమోలు పైవంతెన నుంచి గొల్లపూడి మీదుగా వెళుతున్నాయి. దీంతో గొల్లపూడి వై జంక్షన్ నుంచి ఇబ్రహీపట్నం వరకు రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాలు జామ్ అవుతున్నాయి.