ముఖ్యమంత్రి జగన్ తెదేపా నేతలపై విమర్శలు మాని... తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే తన గురించి చెప్పుకుంటున్న సంగతులు గుర్తించాలని... తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ హితవు పలికారు. వైకాపా ఎమ్మెల్యేలు సిట్టింగులు వేసి మరీ జగన్ గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ఎవరెవరు అలా మాట్లాడుతున్నారో తన దగ్గర లిస్ట్ ఉందని... కావాలంటే పంపిస్తానని అన్నారు.
'జగన్.. నీ పాలనను నీ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు' - జగన్ పాలనపై వైకాపా నేతల అసమ్మతి
సీఎంగా జగన్ పాలనను అధికార పార్టీ నేతలే విమర్శిస్తున్నారని.. తెదేపా నేత యరపతినేని శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ పరిపాలన గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. కొందరు చాటుగా అంటుంటే.. మరికొందరు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని చెప్పారు.
కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగానే జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న తీరును ప్రస్తావించారు. కేకు కటింగులు తప్ప అభివృద్ధి లేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం అంటే... నియోజకవర్గంలో నీటి సమస్యపై కందుకూరు శాసనసభ్యులు మహీంధర్ రెడ్డి ధర్నాకు దిగిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇసుక మాఫియా గురించి మాట్లాడితే... రాష్ట్రంలో మందు ఏరులై పారుతోందని స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారని తెలిపారు. ఇళ్లపట్టాల విషయంలో వైకాపా నాయకులు పేదల దగ్గర లంచం తీసుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అనలేదా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి... ఇసుకను తులాల లెక్కన అమ్మిన ఎమ్మెల్యే!