tomato farmers: ఆరుగాలం శ్రమించి పండించిన టమాటా పంటకు ధరల్లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ... కొందరు రైతులు పంటను రోడ్లపక్కన పారబోస్తున్నారు.
tomato farmers: కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో టమాటా సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేసిన వారికి.. కనీస ఆదాయం కూడా చేతికి రావడం లేదు. రైతుబజార్లు, ఇతర మార్కెట్లలో కేజీ టమాటా ధర రూ.10 నుంచి రూ.12 వరకు పలుకుతోంది. కానీ ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు మాత్రం.. కేజీకి ఒకట్రెండు రూపాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొన్నిసార్లు పంటను కొనేవారు కూడా ఉండటం లేదని.. ఒకవేళ కొన్నా రవాణా ఛార్జీలకు కూడా రావడం లేదని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
tomato farmers: గత సంవత్సరం 30 కేజీల టమాటో బాక్స్... కాయల నాణ్యతను బట్టి 2 వేల రూపాయల వరకు పలికింది. దాన్ని చూసి భారీగా పెట్టుబడి పెట్టిన కౌలు రైతులు.. తీరా ఇప్పుడు దిగుబడి వచ్చే సమయానికి ధర లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నెల రోజులుగా టమాటా కేజీ 2రూపాయలకు కూడా కొనేవాళ్లు లేక.. రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఒక్కో ఎకరానికి సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టామని.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని అంటున్నారు. ఒక్కోసారి రవాణా ఛార్జీలు, కమీషన్లకు ఎదురు చెల్లించాల్సి వస్తుండటంతో.. టమాటాలు కోయకుండానే పొలంలో వదిలేస్తున్నట్లు చెబుతున్నారు.
"పెట్టుబడి రూ.40 వేలకుపైగా అయింది. ఇదే టమాటా నేను కొనేటప్పుడు రూ.2,250కి ఒక బాక్సు కొన్నాను. అదే టమాటా బాక్సు ఈ రోజు రూ.60కి కొంటుంటే... తిరిగి మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. రైతుకు 10 రూపాయలన్నా గిట్టుబాటు లేకపోతే మేము ఏ నుయ్యో... గొయ్యో చూసుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఇంట్లో భార్యబిడ్డలపై కోపాన్ని చూపాల్సి వస్తోంది. ఈ బాధను భరించలేకపోతున్నాం. ప్రభుత్వం ఏదో ఒకటి చేసి రైతులను ఆదుకోవాలి. కిలోకు రూ.10 అయినా గిట్టుబాటు ఇవ్వాలని కోరుకుంటున్నాం."- రైతు
tomato farmers: రైతులు ఎంత పంట వేశారు, ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలు "ఈ-క్రాప్"లో నమోదు చేసుకున్నా... ఆర్బీకే నుంచి ఎలాంటి సహకారం లేదని రైతులు చెబుతున్నారు. అలాగే మార్కెటింగ్ శాఖ నుంచి కూడా సాయం అందడం లేదంటున్నారు. మోపిదేవి మండలంలో శీతల గిడ్డంగి నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. శీతల గిడ్డంగులు ఏర్పాటుచేస్తే టమాటాలు నిల్వ చేసుకుని... ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం కలుగుతుందని అంటున్నారు.
ఇదీ చదవండి:పేదలపై నాలా పిడుగు... గగ్గోలు పెడుతున్న బాధితులు