Government Talks with Employees Unions : పీఆర్సీ పెండింగ్ అంశాలతో పాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై మూడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇవాళ చర్చలు జరుపుతోంది. ఏపీ జేఏసీ అమరావతి ఈ నెల 9వ తేదీ నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను అత్యవసరంగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే ఓ దఫా మంత్రి బొత్స నివాసంలో అనధికారికంగా చర్చలు నిర్వహించిన మంత్రుల కమిటీ సభ్యులు.. ఇవాళ మరోమారు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్లను మాత్రమే ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సంఘానికి ముగ్గురు ప్రతినిధుల చొప్పున చర్చలకు రావాలని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు.
సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. కాగా, ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు. ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థికపరమైన వివరాలు చెప్పాలని కోరారు. మార్చి 9వ తేదీ నుంచి జరిగే ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని నేతలు తేల్చిచెప్పారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు.. వాటి ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెల్లడించారు.