ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష్మణ రేఖ గీసుకుందాం.. గృహ వాసం పాటిద్దాం - follow ram in this carona time

అయోధ్య పేరు తెలియని వారుండరు. కరవు కాటకాలు లేకుండా అకాల మరణాలు రాకుండా ప్రజలంతా సుభిక్షంగా జీవించిన రామరాజ్యం అది. రాముని బాటలో జనం నడుచుకుంటే ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా విజయం సాధించడం కష్టమేమీ కాదనేది జగమెరిగిన సత్యం. నేడు కరోనా మహమ్మారి కోరలు చాచిన వేళ.. నాడు రామాయణంలో ఆచరించిన కొన్నిటిని మనం అన్వయించుకుంటే ఆ వైరస్‌ను తరిమి కొట్టడం కష్టం కాదని పండితులు చెబుతున్నారు.

krishna district
నేడు శ్రీరామనవమి..పరిశుభ్రతే ప్రతివారి బలి

By

Published : Apr 2, 2020, 11:58 AM IST

రామాయణం.. సకల సమస్యలకు పరిష్కారం చూపే మార్గమని భక్తుల విశ్వాసం. అందులోని ఇలాంటి విషయాలను పాటిస్తే.. మన జీవితాన్ని ఆనందదాయకం చేసుకోవచ్చన్నది పండితుల నమ్మకం.

● తండ్రి మాటకు కట్టుబడి సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్లి వనవాసం చేసిన ఘనత రాముడిది. నేటి పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేయడానికై ఎవరికి వారు గృహ వాసం చేస్తే చాలని అధికారులు చెబుతున్నారు.

● వనవాస సమయంలో సీతను శత్రువులు అపహరించకుండా నివాసం చుట్టూ లక్ష్మణుడు రేఖ గీశారు. దానికి లక్ష్మణ రేఖ అనే పేరు ప్రసిద్ధికెక్కింది. నేడు కరోనాకు చిక్కకుండా ఎవరికి వారు ఇళ్లు దాటి బయటకు రాకుండా స్వీయ లక్ష్మణరేఖ గీసుకోవాలి.

● పితృవాక్య పరిపాలనలో రాముడిది అందెవేసిన చేయి. నేడు లాక్‌డౌన్‌లో భాగంగా పిల్లలు పెద్దలు కలిసి ఎక్కువ సమయం గడిపే సదవకాశం లభించింది. దీనిలో పెద్దలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే అదే పిల్లలకు అలవాటవుతుంది. అదే క్రమంలో నీతి ధర్మాలను వివరిస్తూ కరోనా లాంటి పరిస్థితులు సంభవిస్తే భవిష్యత్తులో వారు జాగ్రత్త పడేలా అవగాహన కల్పించాలి.

● రాముడు మృధు స్వభావి, మితభాషి, క్రమశిక్షణకు మారుపేరు. నేటి విపత్కర పరిస్థితుల్లో పౌరులకు కావలసింది ఇదే. తక్కువగా మాట్లాడటం, గుంపులో గోవిందంలా తిరగకుండా క్రమశిక్షణగా ఉండటం అవసరం.

● రామాయణ కాలంలో కనిపించే శత్రువులతో పోరాటం చేశారు. నేడు కరోనా వైరస్‌ లాంటి కనిపించని శత్రువులను జయించడానికి అప్రమత్తతే అవసరం.

● నాడు రావణలంకకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వారధికి ఉడతాభక్తిగా ఒక ఉడత సాయం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నేటి అత్యవసర పరిస్థితుల్లో పౌరులు పేదలను ఆదుకునేందుకు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

● రామరాజ్యం అన్ని విధాలా బాగుండటానికి నాడు రామదూతలు చేసిన కృషిని నేడు రక్షకభటులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తుండటం.. ప్రతి ఒక్కరు వారికి సహకరించడం రామభక్తిలాగా ప్రజలపై భక్తిని చూపడం నాడులాగే నేడూ ప్రశంసలందుకుంటోంది.

ఇది చూడండి:

ఆదర్శ పురుషోత్తముడు, సకల గుణధాముడు.. శ్రీరాముడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details