కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి మొట్టమొదటిసారి ఆర్జీయూకేటీ పరిధిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ... భౌతిక దూరంతో ప్రతి విద్యార్థి శానిటైజర్, వాటర్ బాటిల్ వెంట తెచ్చుకుంటున్నారు.
నూజివీడు పట్టణంలోని ఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ట్రిబుల్ ఐటీ ఎంట్రన్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. పదో తరగతి పరీక్ష నిర్వహించనందున ట్రిబుల్ ఐటీ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేశారని...తాము పూర్తిగా సంసిద్ధమైనట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో శానిటైజర్ నిర్వహిస్తూ, రెవెన్యూ, పోలీస్, మెడికల్ సిబ్బందిని పర్యవేక్షణలో ఉంచారు. నిమిషం ఆలస్యమైతే అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.