కరోనా మహమ్మారి.. రోజుల వ్యవధిలో ఓ కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెను పొట్టన పెట్టుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ అపార్టుమెంట్లో నివాసముంటున్న వస్త్ర వ్యాపారి, వైకాపా ఉయ్యూరు ఏరియా వాణిజ్య విభాగం నాయకుడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆలమూరి చంద్రమోహన్(59) కరోనాతో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. ఆయన భార్య నాగమణి(54).. ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి గ్రామంలో కొవిడ్‌తో గురువారం ప్రాణాలు విడిచారు. శుక్రవారం రాత్రి వారి కుమార్తె పద్మ(30) విజయవాడ వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఉన్న ఒక్క కుమారుడు సాయి పరిస్థితి దయనీయంగా మారింది. వరుస కర్మకాండలు నిర్వహించి నిన్న మధ్యాహ్నం ఉయ్యూరు వచ్చిన అతడికి అక్కడి నివాసితులు అడ్డగించడంతో కొంత మనస్తాపానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి సాయితో మాట్లాడి అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
మూడు రోజుల వ్యవధిలో భర్త, భార్య.. కుమార్తె మృతి - corona deaths news
కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. కొవిడ్ సోకి కుటుంబాలలోని వ్యక్తులంతా మరణించిన ఉదంతాలు కలచి వేస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మూడు రోజుల వ్యవధిలో మృతి చెందారు.
కరోనా మరణాలు