అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ లభ్యం - hostel
పామర్రులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఇవాళ ఉదయం నుంచి అదృశ్యమయ్యారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విజయనగరం రైల్వేస్టేషన్లో కనిపించారు.
కృష్ణా జిల్లా పామర్రు మండలం నాగాపట్నంలో ప్రగతి జూనియర్ కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్ధినుల ఆచూకీ లభ్యమైంది. విజయనగరం రైల్వే స్టేషన్లో వారిని పోలీసులు గుర్తించారు. గుడ్లవల్లేరు మండలానికి చెందిన రష్మిత, అవనిగడ్డకు చెందిన శ్రీయ, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మరో విద్యార్థిని నికిత... నాగాపట్నంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాల హాస్టల్లో ఉండి చదువుతున్న వారు ఇవాళ అదృశ్యమయ్యారు. కళాశాల యాజమాన్యం పామర్రు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం రైల్వే స్టేషన్లో వారిని గుర్తించి... తమ సంరక్షణలోకి తీసుకున్నారు. విజయనగరం రైల్వే స్టేషన్ వరకు ఎలా వచ్చారని పోలీసులు ప్రశ్నించగా... లారీ ఎక్కి వచ్చామని సమాధానమిచ్చారు విద్యార్థినులు.