కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన ఎడ్ల వెంకటేశ్వర్లు( 65), నీలమ్మ (60 )దంపతులు. వారికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఎడ్ల నాగరాజు (40) అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారంతా కలిసి ఓకే ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొవిడ్ లక్షణాలతో మే 14న నీలమ్మ ఇంటి వద్దే మృతి చెందారు. భర్త వెంకటేశ్వర్లుకు సైతం లక్షణాలు కనిపించడంతో చికిత్సకోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే పెద్ద కుమారుడు నాగరాజుకు, మూడో కోడలికి వైరస్ సోకడంతో నాగరాజును ఖమ్మం, కోడలిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
మొదట ఆస్పత్రికి వెళ్లిన వెంకటేశ్వర్లు కొద్దిరోజుల్లోనే కోలుకొని ఇంటికి చేరారు. అప్పటికే భార్య చనిపోవడం.. మరోవైపు కుమారుడు, చిన్న కోడలు ఆస్పత్రి పాలు కావడంతో మనస్తాపానికి గురైన ఆయన మే 20న గుండెపోటుతో మృతి చెందారు. తండ్రి మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉన్న కుమారునికి తెలియజేయలేదు. ఇంటి దగ్గర నుంచి కుటుంబ సభ్యులు ఫోన్లో మాట్లాడి ఆరోగ్య విషయాలు తెలుసుకుంటే.. నాన్న ఎందుకు మాట్లాడటం లేదని పలుమార్లు ఫోన్లో కుటుంబ సభ్యులను నాగరాజు ప్రశ్నించేవారు.