ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల.. కొవిడ్ విస్తరిస్తోందని.. కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. గత డిసెంబరు 2,800 కేసులు, ఈ ఏడాది జనవరిలో 830 కేసులు, ఫిబ్రవరిలో కేవలం 250 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. తిరిగి కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోందని.. కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించడం.. వారిని గుర్తించడం.. చికిత్సలు చేయడం ద్వారానే వ్యాప్తిని తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత ఏడాది మార్చిలో ప్రారంభమైన కొవిడ్ వ్యాప్తి.. ఈసారి మరింత ప్రమాదకరంగా తయారైందని చెప్పారు.
ఎలాంటి లక్షణాలు లేకుండా కొందరిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని కలెక్టర్ అన్నారు. తొలిసారి కరోనా వచ్చిన సమయంలో లాక్‌డౌన్ ప్రకటించి జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొన్నామని... తిరిగి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు 19 ఆసుపత్రులను తిరిగి సిద్ధం చేస్తున్నామని అన్నారు.