కృష్ణా జిల్లా కొండపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పందించింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో చేస్తున్న మైనింగ్‌పై నివేదిక ఇవ్వాలని.. ఏపీ అటవీ ముఖ్య సంరక్షణాధికారికి కేంద్ర శాఖ లేఖ రాసింది. మైనింగ్ వల్ల అరుదైన తెల్లపునికి వృక్షాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్ బాబు ఫిర్యాదు మేరకు కేంద్ర అటవీ శాఖ స్పందించింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొండపల్లి బొమ్మల తయారీలో ఈ తెల్లపునికి కలపను వాడతారని సురేశ్ బాబు వివరించారు.
కొండపల్లి అటవీ ప్రాంతంలో అరుదైన తెల్లపునిక వృక్షాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరించిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. గత 15 ఏళ్లుగా అక్కడ జరుగుతున్న మైనింగ్, చెట్ల నరికివేత. అయితే.. ఆ వృక్షాలతో కొండపల్లి బొమ్మలు తయారుచేసి వేలమంది కొండ జాతీయులు జీవిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల అక్కడి చెట్లు అంతరించిపోవడంతో వాళ్లంతా రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.- సురేశ్ బాబు, సామాజిక కార్యకర్త