TDP agitation for farmers : నందిగామ మండలం లింగాలపాడులో దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి దెబ్బతిన్న పంట పొలాలలో పర్యటించిన ఆయన.. జగన్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాలలో పర్యటించి ప్రభుత్వాన్ని నిలదీసే వరకు గోనెసంచులు, పట్టాలు కూడా ఇవ్వలేదన్నారు. పంట మునిగింది పరిహారం ఇవ్వండి అంటూ రైతుల పక్షాన తెలుగుదేశం పోరాటం చేస్తుందన్నారు. నాలుగేళ్లుగా ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి 4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని దేవినేని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఇంత పెద్ద ఎత్తున దెబ్బతింటే పరదాల ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రాసాదం వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న, తడిసిన, మొలకెత్తిన పంటలను చంద్రబాబు పరిశీలించే వరకు ప్రభుత్వంలో.. అధికారుల్లో కదలిక లేదని మండిపడ్డారు. లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతింటే.. కేవలం 60 వేల ఎకరాలేనని తప్పుడు లెక్కలు చెప్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన మొక్కజొన్న, ధాన్యం సహా దెబ్బతిన్న అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విఫలమైంది.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. పంట నష్టంపై రైతులతో కలిసి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన నిర్వహించింది. మొలకెత్తిన కంకులను కుప్పగా పోసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు.
స్పష్టమైన ప్రకటన చేయాలి.. మోపిదేవి తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. వర్షాలకు నష్టపోయిన ఉద్యాన పంటలకు పరిహారం చెల్లించాలని, తడిసిన, రంగు మారిన మొక్కజొన్న మొత్తాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదని బైఠాయించారు. ఒక పక్క రైతులు ఆకాల వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. దళారులు రైతులతో మాట్లాడుతూ మిల్లర్లతో సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్తున్నారంటే అందులోనూ కమిషన్ కొట్టాలన్న దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.