Gorumudda scheme : పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని దీనికోసం గోరుముద్ద పథకంలో రాగిజావ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిల్లలకు సదుపాయాలు కల్పించడం సహా మేథో వికాసం పెంచడం, ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు రాగిజావ సరఫరా ద్వారా పిల్లలకు పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పోషకాహారం.. రాగిజావ పంపిణీ... ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగి జావ పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గోరుముద్ద పథకంలో భాగంగా మరో పోషకాహారంగా రాగిజావ సరఫరా చేస్తోంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రాగిజావ పంపిణీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. వారంలో మూడు రోజుల పాటు రాగి జావ అందించనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్థులకు రాగిజావ అందజేయనున్నట్లు తెలిపారు. రాగిజావ పంపిణీ కోసం ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయం ఖర్చవుతుందన్న సీఎం.. వీటిలో సత్యసాయి ట్రస్టు రూ.42 కోట్లు, ప్రభుత్వం రూ.44 కోట్లు భరిస్తుందని తెలిపారు. పథకంలో భాగస్వామ్యులవుతున్నందుకు సత్యసాయి ట్రస్టును సీఎం అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి... అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బడి మానేసిన పిల్లల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టామన్న సీఎం.. పిల్లలకు సదుపాయాలు తగ్గించడం, పిల్లల మేధో వికాసం పెంచడం, ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. సంపూర్ణపోషణ, విద్యాకానుక, నాడు-నేడు, సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియం తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ బడుల్లో డిజిటల్ బోధనను అందుబాటులోకి తెస్తున్నామని, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ పంపిణీ చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. పిల్లలను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. భావి ప్రపంచంతో పిల్లలు పోటీ పడి నెగ్గేలా ప్రతి అడుగు వేస్తున్నామన్నారు. మెరుగ్గా గోరుముద్ద తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నట్లు సీఎం తెలిపారు.