Sand business of ruling party leaders : జేపీ సంస్థ పేరిట అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు దర్జాగా మరో ఏడాది పొడవునా కొనసాగనున్నాయి. ఆ మేరకు ప్రతినెలా పెద్దలకు భారీ మొత్తంలో చెల్లింపులు కొనసాగనున్నాయి. ఇసుక వ్యాపార ఒప్పందం గడువు పొడిగించారనే సమాచారాన్ని గనులశాఖ మాత్రం రహస్యంగా ఉంచింది.
రెండేళ్ల కిందట ఒప్పందం... రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించి ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం 2021లో టెండర్లు పిలవగా.. దిల్లీకి చెందిన జేపీ సంస్థ దక్కించుకుంది. ఆ మేరకు 2021 మే 3న గనుల శాఖతో రెండేళ్ల పాటు ఇసుక తవ్వకాలకు ఒప్పందం చేసుకుంది. అప్పటి వరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక వ్యాపారాన్ని జేపీ సంస్థ తమ చేతుల్లోకి తీసుకుంది. ఒప్పందం పూర్తయిన వెంటనే మే 14 నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. రెండేళ్ల గడువు ఈ నెలలో ముగియనుండగా తిరిగి టెండర్లు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం.. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఒప్పంద గడువు ఎన్నాళ్లు కొనసాగించాలో చెప్పాలని కోరుతూ గనులశాఖ నుంచి ప్రభుత్వానికి దస్త్రం వెళ్లడం గమనార్హం. ఏడాది పాటు పునరుద్ధరించేందుకు సర్కారు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో ఇటీవల ఒప్పందాన్ని పునరుద్ధరించారు.
సబ్ కాంట్రాక్టుతో మొదలైన దోపిడీ.. జేపీ సంస్థకు రెండేళ్లపాటు ఇసుక టెండరు దక్కినా.. ఉప గుత్తేదారుగా రంగప్రవేశం చేసిన చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఆధీనంలోనే రాష్ట్రమంతా ఇసుక తవ్వకాలు, విక్రయాలు సాగాయి. నిబంధనల ఉల్లంఘనలు, దందా యథేచ్ఛగా జరిగాయి. ఆ సంస్థ ప్రతినెలా పెద్దలకు భారీగా కప్పం కట్టేలా ఏర్పాట్లు చేయడంతో.. ప్రభుత్వశాఖలేవీ ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలపై జోక్యం చేసుకోలేదు.