ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెజవాడలో గుప్పుమంటున్న గంజాయి.. 3నెలల్లో 157 మంది అరెస్ట్..

Ganja sales in Vijayawada: విజయవాడలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మూడు నెలల్లో 67 కేసులు నమోదు కాగా 157 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. వ్యవస్థీకృతంగా గంజాయి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని.. నగర బహిష్కరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు విజయవాడ సీపీ తెలిపారు.

Ganja sales going on in Vijayawada
బెజవాడలో గుప్పుమంటున్న గంజాయి

By

Published : Apr 1, 2023, 3:22 PM IST

Updated : Apr 1, 2023, 4:34 PM IST

Ganja sales in Vijayawada: పార్శిల్ ముసుగులో ద్రవరూపంలో ఉన్న గంజాయిని విజయవాడ మీదుగా సరిహద్దులు దాటిస్తున్నారు. గంజాయి కన్నా కిక్కెంచే ఎండిఎంఏ రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఆరు నెలలుగా కాకినాడ నుంచి తూర్పుగోదావరికి యథేచ్ఛగా ఎండీఎంఏ సరఫరా చేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి కేసులు పెడుతున్నా.. అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.

యథేచ్ఛగా ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి రవాణా కొనసాగుతూనే ఉంది. విశాఖ, ఏవోబి సరిహద్దుల నుంచి విజయవాడ మీదుగా ముంబయి, హైదరాబాద్, పుణె, బెంగళూరు, చెన్నైలకు గంజాయి సరఫరా అవుతోంది. అక్రమ రవాణా పకడ్బందీగా సాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని.. వారిని గంజాయి సరఫరా చేసేందుకు వినియోగించుకుంటున్నారు. సరకును గమ్య స్థానాలకు చేర్చినందుకు కమీషన్‌ రూపంలో వారికి నగదు చెల్లిస్తున్నారు.

సరకు ఎవరు పంపుతున్నారు?ఎవరికి డెలివరీ చేయాలి?అనే విషయాలను కొరియర్‌కు చెప్పరు. సరకును ఏ ప్రాంతంలో ఉంచాలో మాత్రమే చెబుతారు. కొరియర్‌.. నిర్దేశిత ప్రాంతంలో గంజాయి మూటలను ఉంచి తిరిగి వెళ్లిపోతాడు. దీంతో పోలీసుల తనిఖీల్లో కేవలం ఏజెంట్లు మాత్రమే దొరుకుతున్నారు. విక్రయించే దళారులు, గంజాయి మాఫియా వెనుక ఉన్న కీలక నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, రైళ్లు, కార్లలో అధికంగా ఈ రవాణా జరుగుతోంది. బస్సుల్లో సైతం గుట్టుచప్పుడు కాకుండా దీన్ని రవాణా చేస్తున్నారు.

విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన పలువురు చదువుతున్నారు. వీరిలో కొందరు మత్తుకు అలవాటుపడ్డారు. దీంతో దీన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటుని.. తమ ఆర్థిక అవసరాల మేరకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల చుట్టుపక్కల ఉండే కిళ్లీషాపులు, పూల దుకాణాలు, బడ్డీ కొట్లలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి.

మొదట విద్యార్థికి గంజాయిని ఉచితంగా ఇస్తారు. ఆ తర్వాత వారికి అలవాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా మత్తుకు బానిసలుగా మారుతున్నారు. కొంతమంది విద్యార్ధులు గ్రూపులుగా కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో గుట్టుగా దీన్ని సేవిస్తున్నారు. కృష్ణలంక, పటమట, మాచవరం, గుణదల, రైల్వేస్టేషన్, అజిత్‌ సింగ్‌ నగర్, నున్న, భవానీపురం, వన్‌టౌన్, టూటౌన్, తదితర ప్రాంతాల్లో అడ్డాలుగా మారాయి.

మత్తు పదార్ధాల వినియోగం, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సీపీ కాంతిరాణా చెబుతున్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు కో-ఆర్డినేషన్ కమిటీని కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి డ్రగ్స్ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన విద్యార్థులకు, మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మానసిక వైద్య నిపుణులతో కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు.

గత మూడు నెలలుగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 67 కేసులు నమోదు చేశారు. 157 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 167 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అధికంగా ఏజెన్సీ నుంచి 2 నుంచి 5 కేజీల వరకు తీసుకొచ్చే వారే అధికంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎనిమిది మంది సరఫరాదారులు, 132 మంది విక్రేతలున్నారని తెలిపారు. విద్యార్థులతో పాటు రోజు వారీ పనులు చేసుకునే వాళ్లు, ఆవారాగా తిరిగే వాళ్లు చాలా మంది గంజాయికి బానిసలుగా మారారని సీపీ చెబుతున్నారు.

" మత్తు పదార్థాల నియత్రణకు ఎన్​సీఓఆర్డీ మీటింగ్స్​ను జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పెట్టమని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందుకుగాను వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి డ్రగ్స్ విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు తగిన చర్యలను తీసుకుంటున్నాము. దీంతోపాటు గంజాయి సేవిస్తూ పట్టుబడిన మైనర్లు, విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మానసిక వైద్య నిపుణులతో కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నాం."
- కాంతిరాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా సీపీ

Last Updated : Apr 1, 2023, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details